శ్రీకాకుళం జిల్లా,మెళియాపుట్టి పరిధిలోని పరుశరాంపురం గ్రామానికి చెందిన జన్ని అశ్వని(21) ఆత్మహత్య కేసులో భర్త కృష్ణారావు, అత్త తులసమ్మ, మామ పుచ్చన్న, ఆడపడుచులు జి.అదిమ్మ, జి.శ్రీదేవి కట్నం కోసం వేధించేవారని అశ్వని తల్లి కాంతమ్మ ఫిర్యాదు చేసింది. దీన్నిపై కేసు నమోదు చేసి దిశ డీఎస్పీ వాసుదేవరావు విచారణ చేపట్టారు. వివాహనికి ముందే అశ్వనిని కృష్ణారావు పరిచయం చేసుకుని గర్భవతి చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఒడిశాలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో కట్నం కింద రూ.50 వేలు, ఉంగరం అశ్వని కన్నవారు ఇచ్చారు. బంగారం గొలుసు, ద్విచక్ర వాహనం తీసుకురావాలని వేధించడంతో మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పాముకాటుతో మృతి చెందినట్టు ప్రచారం చేశారు. దీనిని పోలీసులకు, తహసీల్దార్ పి.సరోజినికి అత్మహత్యగా అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పాతపట్నం సబ్‌జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.