కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తెను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ కుమార్తె కావూరి శ్రీవాణిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో కావూరి శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదుకావడంతో.. పోలీసుల లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు కావూరి కుమార్తె శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. దీంతో వెంటనే మహారాష్ట్ర పోలీసులకు విమానాశ్రయ అధికారులు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి పీటీ వారంట్‌పై శ్రీవాణిని మహారాష్ట్రకు తరలించనున్నారు. అయితే, ఈ కేసు ఏంటి? ఎందుకు ఫిర్యాదు చేశారు? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే, గతంలో ఆమె బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. డిసెంబరు 2015లో 18 బ్యాంకులకు చెందిన సిబ్బంది.. శ్రీవాణికి చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడం లేదని మౌన దీక్ష చేపట్టారు. మొత్తం 18 బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్ల రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.200 కోట్లు రుణం తీసుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఓ వెలిగి వెలిగిన కావూరి సాంబశివరావు.. ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిని అందుకున్నారు. కానీ, రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలతో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత కావూరి సైలెంట్ అయిపోయారు.