ఏపీ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రానికి వందేభారత్ స్లీపర్ కోచ్ కేటాయిస్తోంది రైల్వేశాఖ. ఈ విషయాన్ని విజయవాడ డీఆర్‌ఎం నరేంద్రపాటిల్ తెలిపారు. ఆయన నరసాపురం రైల్వేస్టేషన్‌లో పలు విభాగాలను తనిఖీ చేశారు. అలాగే పెండింగ్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. వందేభారత్ స్లీపర్ కోచ్‌లు పట్టాలెక్కగానే నరసాపురం నుంచి బెంగళూరుకు నడిపే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఈ రైలు 10గంటల్లో బెంగళూరు చేరుకుంటుందన్నారు. ఈ రైలు గుంటూరు లేదా వయా ఒంగోలు నడపాలా ఇంకా నిర్ణయించలేదన్నారు. నరసాపురం నుంచి గుంటూరు పాస్ట్ ప్యాసింజర్‌ను పునరుద్దరిస్తామన్నారు. గతంలో మాదిరిగా నడిచినట్లే నరసాపురం నుంచి విశాఖకు రిజర్వేషన్ కోచ్‌లతో ఉన్న లింకు ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి సమయంలో నడిపే ప్రతిపాదన ఉందన్నారు. వారానికో సారి నడుస్తున్న బెంగళూరు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేసే యోచన ఉందన్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించేందుకు ఆమోదం వచ్చిందన్నారు. ఏపీకి వందేభారత్ స్లీపర్ రైలు కేటాయింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే ఏపీ మీదుగా నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు.. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. విజయవాడ నుంచి చెన్నైకు.. కాచిగూడ నుంచి బెంగళూరుకు వందేభారత్‌లు నడుస్తున్నాయి. వీటిలో రెండు రైళ్లను సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రం మీదుగా మరికొన్ని వందేభారత్‌లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. వందేభారత్ స్లీపర్ కోచ్‌లను అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేస్తున్నారు. ప్రతి రైలులో 857 బెర్త్‌లు ఉంటాయి.. వీటిలో 823 ప్రయాణికుల కోసం కాగా, 37 బెర్త్‌లను సిబ్బందికి కేటాయించనున్నారు. రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రతి కోచ్‌లో నాలుగు కాకుండా మూడు టాయ్‌లెట్లు ఉంటాయి. ఒక మినీ ప్యాంట్రీ.. వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో దివ్యాంగులకు అనువుగా ఉండేందుకు ర్యాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కోచ్‌లలో బెర్త్‌లు మరింత వెడల్పుగా ఉండనున్నాయి. ప్రయాణికులు సులభంగా పై బెర్తుకు చేరుకునేందుకు వీలుగా వీటిని డిజైన్ చేశారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. 2024లో ఈ రైళ్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో పాటు వందే మెట్రో రైలును సైతం వచ్చే ఏడాదే తీసుకురానున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వందేభారత్ రైళ్లతో పాటు స్లీపర్లు కూడా పట్టాలెక్కబోతున్నాయి. మరి రైల్వేశాఖ ఏపీకి ఎన్ని రైళ్లు కేటాయిస్తుంది అన్నది చూడాలి.