పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇవాళ ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశమయ్యారు. అందుకే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. చంద్రబాబును రక్షించుకోవడం కోసం సీఎం జగన్ ఇంటికెళ్లి వినతిపత్రం ఇస్తామన్నారు నేతలు. చంద్రబాబు దగ్గరకు ఆయన వ్యక్తిగత వైద్యుల బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చంద్రబాబును తరలించాలన్నారు. ఆరోగ్యపరంగా ఆయన జాగ్రత్తగా ఉండటం వల్లే 73 ఏళ్లున్నా.. 20 ఏళ్ల యువకుడిలా చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లో ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గారన్న నేతలు.. బరువు తగ్గితే శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు సొంత డాక్టర్లను ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు సంప్రదించ లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెబుతామన్నా.. వద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు. చంద్రబాబు దగ్గరకు ఆయన వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద.. ప్రభుత్వ ఆస్పత్రుల మీద తమకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లిచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.