తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.. వీకెండ్ అయినా సరే క్యూ లైన్లలో భక్తుల ఎక్కువమంది లేరు. శనివారం ఉదయం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది. వారాంతంలో ఇలా విచిత్రంగా భక్తుల రద్దీ లేకపోవడం విశేషం. మరోవైపు తిరుమల శ్రీవారిని శుక్రవారం 59,034మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చాయని టీటీడీ తెలిపింది. అలాగే 22,391మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
మరోవైపు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పరణ జరగనుంది. ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 15 నుంచి 23 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. అలాగే మహారథం(చెక్క రథోత్సవం) ఉండదు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడేళ్లకు ఒకసారి పుష్పక విమానసేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 19న గరుడ వాహనం, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరగనున్నాయి. ఈ నెల 14న రాత్రి శ్రీవారి ఆలయంలో అంకురార్పణ జరుగనుంది.
అంతేకాదు ఈ నెల 19న గరుడ వాహన సేవ ఉండటంతో తిరుమల ఘోట్ రోడ్లలోకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ ఉంటుందనే అంచనాతో ప్రివిలేజ్డ్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను, ఆర్జిత సేవల్ని కూడా టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 19వ తేదీ సాయంత్రం శ్రీవారి గరుడోత్సవాన్ని 6.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, తిరుప్పావడ, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. అంతేకాదు మరో ముఖ్యమైన గమనిక.. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు మాత్రమే అనుమతిస్తారని టీటీడీ తెలిపింది. ఈ ఏడాది అధిక మాసంతో తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి.. సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఈ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.