ఏపీలో కోవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. కోవిడ్–19తో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల విషయంలో సానుకూలంగా ఉంది. కోవిడ్‌తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టింది. అయితే గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది. ఇక పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించగా.. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్ సూచించారు. కోవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. నిబంధనలు సడలించి కారుణ్య నియామకాలు చేపట్టాలని విన్నవించారు. ఏ శాఖలో ఖాళీ ఉంటే అందులో కారుణ్య నియామకం కల్పించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఈ నియామకాలను చేపట్టింది. కోవిడ్ సమయంలో ప్రజలకు సేవలు అందిస్తూ కష్ట కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలిచారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ కుటుంబాల్లో కారుణ్య నియామకాలను చేపట్టి ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే ఎక్కువశాతం మందిని ఉద్యోగాల్లో నియమించగా.. ఇప్పుడు మిగిలిన వారిని కూడా నియమిస్తున్నారు.. నిర్ణయంపై ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి.