ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతుల నమోదుకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించినట్టు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. కొత్తగా భూ యజమానులైన రైతు కుటుంబాలు రైతు భరోసా పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. రైతు భరోసాకు అర్హత కలిగిన భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దేవదాయ భూముల కౌలుసాగుదారులు, అటవీ భూ హక్కుదారులు ఆధార్, సీసీఆర్సీ, భూ హక్కు పత్రాలతో ఆర్బీకేల్లో వీఏఏలు, వీహెచ్‌ఏలను సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించారు. జగన్ సర్కార్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తోంది. మొదటి విడతలో రూ. 7,500, రెండో విడతలో రూ. 4,000, మూడో విడతలో రూ. 2,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలో బటన్ నొక్కి డబ్బుల్ని ఖాతాలకు విడుదల చేస్తుననారు. వైఎస్సార్ రైతు భరోసా మొత్తం రూ. 13,500 లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 అందిస్తుండగా.. మిగిలిన రూ. 6,000 కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తున్నారు. వ్యవసాయ భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.