బతికుండగానే మరణ దినోత్సవ వేడుకలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముందుగానే తనకు మరణం ఎప్పుడొస్తుందో తెలుసట.. అందుకే బతికుండగానే ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకుని అందరికి షాకిచ్చారు. మరణ దినం పేరుతో ఏకంగా ఆహ్వాన పత్రికల్ని పంచేశారు.. ఇవాళ ఆ వేడుకను ఘనం నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు ఈ విచిత్రమైన తీరుపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ ఏడాది కూడా.. తన మరణ దినోత్సవ వేడుకలకు తన ఆత్మీయులందరికీ ఆహ్వానం అందించారు. ఆయనే స్వయంగా వెళ్లి తన చివరి ఘడియలను తానే నిర్ణయించుకుని మరణ దినోత్సవ వేడుకలపేరుతో ఆహ్వానం ఇవ్వడం విశేషం. గతేడాది డిసెంబర్‌లోనూ ఇలాగే తాను మరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ ఏడాది వేడుకల్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తానను 1959లో జన్మించానని.. తాను 75సంవత్సరాలు జీవించగలనని చెబుతున్నారు. అంటే తాను 2034వ సంవత్సరం జీవితంలో చివరి ఏడాదిగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
పాలేటి రామారావు గతేడాది కూడా ఇంకా 12 ఏళ్లు ఉందని లెక్కించి 12వ మరణ దిన వేడుకలు జరుపుకున్నారు. ఈసారి 11వ మరణ దిన వేడుకలకు ఆహ్వానం అందించారు. ఈనెల 14న టీటీడీ కళ్యాణ మండపంలో వేడుకలు జరుగనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది 10వ మరణ దిన వేడుకలకు ఆహ్వానిస్తానని కూడా ఆహ్వాన పత్రికలో ప్రస్తావించారు. ఇలాంటి ఆహ్వానం చాలా అరుదు కాగా.. దీనికి తాను ఆధ్యాత్మిక చింతనతో ప్రేరణ పొందినట్లు చెబుతున్నారు. ఏ జీవైనా పుట్టిన తర్వాత మరణం తప్పదని.. అలాంటిది మనిషి విపరీత కోరికలతో అనేక పొరపాట్లకు పాల్పడుతున్నారన్నారు.
తాను ఎంత కాలం జీవించగలనో ఎవరైనా అంచనా వేసుకోగలిగితే జీవించి ఉన్న కాలంలో నలుగురికీ ఉపయోగపడే పనులు ఏమి చేయవచ్చో చేసుకుంటారన్నారు. జీసస్, కృష్ణ, గౌతమ బుద్దుడు, అల్లా చెప్పిన శాంతి సందేశాలను పాలేటి రామారావు ప్రస్తావిస్తున్నారు. తాను జీవించి ఉన్న కాలంలోనే బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు ఉంటాయనేది అందరూ గుర్తుంచుకునే విధంగా ఆచరణలో చూపాలనే తాను ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. రామరావు మరణ దినోత్సవ వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పాలేటి రామారావు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా పేరు ఉంది. చీరాలలో ఆయన 1994, 1999లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అలాగే మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన రామారావు.. కొణిజేటి రోశయ్య చేతిలో ఓడారు.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. చీరాల నుంచి బరిలోకి దిగి ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు.. 2019 ఎన్నికల వరకు పార్టీలో కొనసాగిన ఆయన.. చీరాల ఎమ్మెల్యే బలరాంతో కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. పేరుకే పార్టీలో ఉన్న పెద్దగా యాక్టివ్‌గా లేరు.