దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇక ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఏ రాష్ట్రంలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. వాటిలో ఎన్నికల నిర్వహణకు అధికారుల కేటాయింపు, ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌లు ఇలా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు గంటల తరబడి వేచి చూడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం పోలింగ్ సమయం ముగిసేలోపు పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని రాత్రి వరకు అయినా ఉండి ఓటు వేసేవారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఇక్కడ కేవలం ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉండటం విశేషం.
ఈ దేశంలోనే అతి చిన్న పోలింగ్ స్టేషన్ ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. భరత్‌పూర్ సన్హాట్‌లో ఉన్న షెరదాండ్ గ్రామంలో కేవలం ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. కొరియా జిల్లా సోన్హట్ బ్లాక్ చంద్ర గ్రామ పంచాయతీకి సమీపంలో ఈ షెరదాండ్ గ్రామం ఉంటుంది. దట్టమైన అడవుల్లో ఉండే ఈ షెరదాండ్ గ్రామంలో కేవలం 3 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం అంటే 2008 లో ఇద్దరు ఓటర్ల కోసం ఈ షెరదాండ్ గ్రామంలోని ఒక గుడిసెలో తొలిసారి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న మూడు ఇళ్లలో 60 ఏళ్ల మహిపాల్ రామ్ అనే వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇక రెండో ఇంట్లో రామ్ ప్రసాద్ చెర్వా అనే వ్యక్తి తన భార్య సింగారో, నలుగురు పిల్లలు ఉంటున్నారు. మూడో ఇంట్లో దస్రు రాము అనే వ్యక్తి తన భార్య సుమిత్ర, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మొత్తం మూడు ఇళ్లలో కలిసి ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఆ ఐదుగురిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 148 వ పోలింగ్ స్టేషన్ ఈ షెరదాండ్ గ్రామానికి సంబంధించినదే. 2008 నుంచి ఒక గుడిసెలో ఓటింగ్ నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం బిల్డింగ్ నిర్మించారు. మరో వైపు.. అదే అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంటోలో 12 మంది ఓటర్లు, రేవలలో 23 ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ శాసనసభకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 7 వ తేదీన జరగనుండగా.. నవంబర్ 17 వ తేదీన రెండో దశ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఐదుగురు ఓటర్లు ఉన్న షెరదాండ్ గ్రామంలో తొలి విడతలో నవంబర్ 7 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ 3 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.