సోషల్ మీడియా ద్వారా యువతులకు మాయమాటలు చెప్పి వారితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోని , ఆ తర్వాత ఆ ఫొటోలను కుటుంబ సభ్యులకు పంపిస్తానని, సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. వివరాల్లోకి వెళ్ళితే... కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమవరం గ్రామానికి చెందిన లంకా రాజేశ్ డిగ్రీ చదివాడు. అతడికి సింగరాయకొండకు చెందిన యువతితో షేర్‌చాట్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెతో చనువు పెంచుకుని అప్పుడప్పుడూ వచ్చి కలిసేవాడు. ఈ క్రమంలోనే ఆమెతో కొన్ని ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని ఆమె బంధువులకు పంపుతానని, సోషల్ మీడియోలో షేర్ చేస్తానని బెదిరించి యువతి వద్ద నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. ఈ నెల 5న సింగరాయకొండకు వచ్చి ఆమె గొంతుపై కత్తిపెట్టి చంపుతానని బెదిరించి రూ.20 వేలు బలవంతంగా తీసుళ్లాడు. ఆ తర్వాత కూడా యువతికి పదేపదే ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించాడు. ఆమె పంపకపోవడంతో ఈ నెల 11న కొన్ని ఫొటోలను ఆమె కుటుంబసభ్యులకు పంపాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంగళవారం స్థానిక కందుకూరు రోడ్డు సెంటర్‌లో రాజేశ్‌ను అదుపులోకి తీసుకుంది.