విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అయితే దసరా సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. అలాగే అమ్మవారి లడ్డూ ప్రసాదానికి డిమాండ్ కూడా భారీగా ఉంటుంది. ప్రతి ఏటా లడ్డూలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.. దేవస్థానం కూడా అందుకు తగినట్లుగా భారీగా లడ్డూలను తయారు చేస్తోంది. తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. అలాగే దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి కూడా గత ఏడేళ్లుగా ఆదరణ లభిస్తోంది. దుర్గమ్మ ఆలయంలో ముఖ్యంగా దసరా సమయంలో లడ్డూ ప్రసాదాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందుకే ఆలయ అధికారులు డిమాండ్‌కు తగినట్లుగా తయారీని కూడా పెంచారు.. అలాగే తయారీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. వాస్తవానికి కనకదుర్గమ్మతో పాటూ మిగిలిన శక్తి పీఠాలలో పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే పులిహోరను ఒకటి, రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.. అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదాలకు ఎక్కువ తయారు చేస్తున్నారు. ఈ లడ్డూ ప్రసాదాలను వారం పాటూ అవసరమైన ఉష్ణోగ్రతల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈసారి కూడా హై డిమాండ్ ఉండటంతో 25 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాలను శనగపిండి, పంచదార పాకం, జీడిపప్పు, యాలుకల పొడితో తయారు చేస్తారు. జాజికాయ పొడి, పచ్చ కర్పూరంతో మరింత టేస్ట్ వస్తుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. దుర్గమ్మ ఆలయంలో లడ్డూల తయారీలో మహిళలదే కీలక పాత్ర. ఆలయ అధికారుల సూచనల మేరకు లడ్డూ సైజ్ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లడ్డూ నాణ్యత, తయారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తుంది.