ఓ వ్యక్తి ప్రముఖ రెస్టారెంట్లకు వెళ్లి.. తనకు నచ్చిన ఫుడ్ పీకల్దాక తిని బిల్లు ఎగ్గొట్టేందుకు గుండెపోటు డ్రామాలు ఆడి అక్కడ నుంచి బయటపడతుంటాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 20 రెస్టారెంట్లకు ఇలాగే టోకరా వేశాడు. దీంతో సదరు వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిన రెస్టారెంట్లు.... హెచ్చరికగా అతడి ఫోటోను విడుదల చేశాయి. 20కి పైగా రెస్టారెంట్లకు బిల్లులు ఎగ్గొట్టిన అతడు గత నెలలో చివరకు చిక్కాడు. ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన అతడు.. బిల్లు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. రెస్టారెంట్ సిబ్బంది సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విస్తుగొలిపే ఈ ఘటన స్పెయిన్ బ్లాంకా ప్రాంతంలోని అలికంటా నగరంలో చోటుచేసుకుంది. నిందితుడు ఆ ప్రాంతంలోని ప్రముఖ హోటల్స్‌కు వెళ్లి.. భోజనం చేసిన తర్వాత గుండెపోటు వచ్చినట్టు డ్రామాలాడుతాడు. ఇది నిజమేనని నమ్మి బిల్లు గురించి పట్టించుకోకుండా అతడ్ని రెస్టారెంట్ సిబ్బంది ఆస్పత్రికి తరలించేవారు. ఇలా 20 రెస్టార్లెంట్లు బాధితులుగా మారారు. గత నెల ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన నిందితుడు.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్ బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ సమయంలో వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే సిబ్బంది అడ్డుకున్నారు. బిల్లు చెల్లించకుండా వెళ్తున్నారని అడిగితే.. హోటల్ గదిలో డబ్బులు ఉన్నాయని, వెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. కానీ, సిబ్బంది అతన్ని విడిచిపెట్టలేదు. దీంతో తన గుండెపోటు నాటకానికి మళ్లీ తెరతీశాడు. నాటకీయంగా మూర్ఛపోయినట్లు నటించి, నేలపై పడిపోయాడని రెస్టారెంట్ మేనేజర్ స్థానిక మీడియాతో చెప్పారు. ‘మేము అతని ఫోటోను అన్ని రెస్టారెంట్‌లకు పంపాం.. మళ్లీ మస్కా కొట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాం’ అని వివరించారు. ఆ వ్యక్తి ప్రముఖ బ్రాండెడ్ దుస్తులు, ట్రెక్కింగ్ షూస్ ధరించి ఉన్నట్టు మీడియా తెలిపింది. తనకు గుండెపోటు వచ్చిందని, అంబులెన్స్ కోసం కాల్ చేయమని కోరాడు. అతడి వేషాలు పసిగట్టిన రెస్టారెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. అతడ్ని పలు రెస్టారెంట్లకు బిల్లులు ఎగ్గొట్టిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.