హమాస్‌పై ఇజ్రాయేల్ ప్రతీకార దాడులతో గాజా నగరంలో ఎటుచూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. పూర్తిగా ధ్వంసమైన ఈ నగరంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక ఆకలిదప్పులతో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాంబు దాడుల్లో గాయపడిన బాధితులకు చికిత్స చేయలేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గాజాలో దయనీయ పరిస్థితులు యావత్తు ప్రపంచాన్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. దీంతో గాజాకి ఆపన్నహస్తం అందజేయడానికి అమెరికా ముందుకొచ్చింది. మానవతా సాయం కింద 100 మిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బైడెన్ బుధవారం ఇజ్రాయేల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
కానీ, బాధితులకు సాయం చేసేందుకు గాజాలోకి ప్రవేశించాలంటే ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్‌ను దాటాల్సి ఉంటుంది. అయితే, ఇజ్రాయేల్ దాడులతో ఈజిప్ట్ మూసివేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దులు తెరిపించడానికి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో అమెరికా అధ్యక్షుడు జరిపిన చర్చలు ఫలించాయి. రఫా బార్డర్ క్రాసింగ్ తెరిచేందుకు ఆయన అంగీకరించారు. దీంతో గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైంది. దీనిపై జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ రఫా సరిహద్దు తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఈజిప్టు అధ్యక్షుడు అంగీకరించారు అని తెలిపారు.
తమవైపున ఉన్న సరిహద్దుల్ని మూసివేసిన ఇజ్రాయేల్.. ముప్పేట దాడి చేయడంతో గాజాలోని పాలస్తీనా పౌరులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకు రఫా బార్డర్ క్రాసింగ్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి అవకాశముందని, ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని భావించిన ఈజిప్టు రఫా బార్డర్ క్రాసింగ్‌ను మూసివేసింది. తాజాగా బైడెన్ చర్చలు జరపడంతో తెరవడానికి అంగీకరించింది. దీంతో మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి.
మరోవైపు, గాజా అల్ అహ్లి ఆస్పత్రి వద్ద జరిగిన పేలుడులో 500 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. వీరికి చికిత్సలు చేయడం వైద్యులకు చాలా కష్టంగా మారింది. ఇక పేలుడు ఘటనపై యావత్తు ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గాజా ఆసుపత్రి పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రమైన అంశమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ... క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ఘర్షణల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన, ఆందోళనకర అంశమని, ఇందుకు కారకులకు శిక్ష పడాలని మోదీ పేర్కొన్నారు.