సీఎం జగన్ కి రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపించడం లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. గురువా రం కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం చిన్నహుల్తిలో పంట పొలాలను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచం ద్రయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..... రాష్ట్రంలో 300 పైచిలుకు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావంతో రాయలసీమ జిల్లాలతోపాటు అనేక ప్రాంతాల్లో పంటలన్నీ ఎండిపోయి రైతులకు అపార నష్టం కలిగిందన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు చేతికందక పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో చర్చించి కరువు పరిస్థితులపై ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామ ని హెచ్చరించారు.