ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 20 నాటికి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇటు ఏపీ వైపుగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది.
ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది ఏపీ విప్తతుల నిర్వహణ సంస్థ. ఈ నెల 23 నుంచి రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటున్నారు. త్వరలో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వంటివి ఏర్పడితే మరింత అనుకూలత ఉంటుందంటున్నారు. ఈనెల 20న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయంటున్నారు. అనంతరం రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఉత్తరకోస్తాకు తుఫాన్ గండం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి.. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 22వ తేదీకల్లా వాయుగుండంగా.. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడనుందని భావిస్తున్నారు. ఈనెల 25 కల్లా ఉత్త రకోస్తా, దక్షిణ ఒడిశా తీరాల దిశగా వచ్చి తుఫాన్‌గా మారుతుందని చెబుతున్నారు. అదే జరిగితే కోస్తా ప్రాంతంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.