కడప జిల్లాలో విషాదం జరిగింది. అన్నదమ్ములు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. అన్న మరణవార్త విని సొంత ఊరికి బయల్దేరిన తమ్ముడు కూడా ఊహించని ప్రమాదంలో చనిపోయాడు. మైదుకూరు మండలం గంజికుంటకు పాములేటి రాజా, నాగలక్షుమ్మ దంపతులకు పాములేటి నరేంద్ర,రాజేష్, ఒక కుమార్తె సంతానం. నరేంద్ర తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. రాజేష్ హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు నరేంద్ర ఎప్పటిలాగే గురువారం ఉదయం తల్లిదండ్రులతో కలసి పొలం వెళ్లారు. అక్కడ పంపుసెట్టుకు స్టార్టర్ అమరుస్తుండగా.. 11 గంటల సమయంలో కరెంట్ షాక్ తగిలింది. వైద్యం కోసం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న రాజేష్ వెంటనే హైదరాబాద్ నుంచి బైక్‌పై బయలుదేరారు. మార్గం మధ్యలో శంషాబాద్ దగ్గర మధ్యాహ్నం అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దకుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులకు రాజేష్ మరణం గురించి తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకేరోజు ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.