శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కియా ఇండియా పెద్ద మనసు చాటుకుంది. ప్రభుత్వ ఐటీఐ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆటోమొబైల్, మెకానికల్ విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ, పరిశోధనకు ఉపయోగపడేలా సీఎస్‌ఆర్‌లో భాగంగా 8 కార్లను అందించింది. గురువారం కియా ఫ్యాక్టరీ ఆవరణలో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఫ్యాక్టరీ సీఏవో కబ్‌డాంగ్‌లీ చేతుల మీదుగా కార్లకు సంబంధించిన పత్రాలను అందజేశారు. యువతకు తమ పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తోందన్నారు సీఏవో కబ్‌డాంగ్‌లీ . ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కే) వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, డోన్, అనంతపురం, తాడిపత్రి, ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రసాదరెడ్డి, రామమూర్తి, మంతేసులు, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ఎస్కేయూ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణకుమారి పాల్గొన్నారు. కార్లు అందజేసిన కియాకు ధన్యవాదాలు తెలిపారు. కియా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల కోసం కార్లు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.