దసరా పండుగ వేళ జగన్ సర్కార్.. గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దసరా కానుక ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు డీఏ విడుదలపై రేపు (అక్టోబర్ 21 తేదీన) ఉత్తర్వులు వెలువడనున్నాయి. జులై 2022కు గానూ.. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. మరోవైపు.. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా దసరా వేళ జగన్ సర్కార్ శుభవార్త వినిపించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ధన్యావాదాలు తెలిపారు. మరోవైపు.. ఏపీలోని నిరుద్యోగులకు కూడా జగన్ సర్కార్ తీపి కబురు వినిపించింది. గ్రూప్-2లో మరో 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు మరో 212 పోస్టులు పెంచాలని నిర్ణయించటంతో.. గ్రూప్-2 పోస్టుల సంఖ్య 720కి పెరిగింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంలో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.