తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చిక్కుల్లో పడ్డారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మహువా మొయిత్రా డబ్బులు అడిగారని వస్తున్న ఆరోపణల వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ గ్రూప్‌లకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడేందుకు ఆమె ఓ బిజినెస్‌మెన్ నుంచి డబ్బులు, ఖరీదైన బహుమతులు డిమాండ్ చేసిందని.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను సమర్థిస్తూ బిజినెస్‌మెన్ దర్శన్ హీరానందానీ.. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖనే పెను సంచలనంగా మారింది. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి లేఖ రాసిన దర్శన్ హీరానందానీ.. ఎంపీ మహువా మొయిత్రాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ రాసిన లేఖ తమకు అందిందని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో పార్లమెంటు ఎథిక్స్ కమిటీ వాటిని పరిశీలిస్తోందని తెలిపారు. అయితే పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి దర్శన్ హీరానందానీ చేసిన 10 ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా అతి తక్కువ కాలంలోనే మహువా మొయిత్రా పేరు తెచ్చుకోవాలని మహువా మొయిత్రా అనుకుందని.. అందుకోసం ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేయడం ద్వారా పేరు సంపాదించుకోవాలని అనుకుందని అందులో పేర్కొన్నారు. అయితే బిజినెస్‌మెన్ గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని హీరానందానీ రాసినట్లుగా ఉన్న లేఖలో పేర్కొన్నారు.
అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశాలున్న ప్రశ్నలను మహువా మొయిత్రా రూపొందించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్ లక్ష్యంగా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మహువా మొయిత్రా పార్లమెంటరీ లాగిన్‌ను తనకు అందించినట్లు హీరానందాని ఆరోపించారు. ఆ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా తాను ప్రశ్నలు పంపించినట్లు ఆ లేఖలో హీరానందాని పేర్కొన్నారు. అందులో తనతోపాటు మరికొందరు మహువా మొయిత్రాకు సహకరించారని తెలిపారు. ఇక అదానీ కంపెనీలకు సంబంధించిన విషయాలపై రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో ఆమె సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. మహువా మొయిత్రాకు ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీతో పాటు పలు భారతీయ మీడియా సంస్థల నుంచి అంతర్జాతీయ జర్నలిస్టుల వరకు అందరితో టచ్‌లో ఉండేదని పేర్కొన్నారు. ఇక గతంలో అదానీ గ్రూపులో పనిచేసిన ఉద్యోగులు, ఇతర వ్యక్తుల నుంచి అన్ అఫీషియల్ వివరాలను తీసుకుని తనతో పంచుకునేదని చెప్పారు. వాటి ఆధారంగా తాను ఆమె పార్లమెంటరీ మెయిల్‌లో ప్రశ్నలను పోస్ట్ చేయడం కొనసాగించినట్లు తెలిపారు.
మహువా మొయిత్రా తరచూ కాస్ట్‌లీ గిఫ్ట్‌లు అడిగేదని పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్‌లో హీరానందాని ఆరోపించారు. ఖరీదైన విలాస వస్తువులను బహుమతులుగా ఇవ్వాలని.. ఢిల్లీలోని తన అధికారిక భవనాన్ని రీ డెవలప్‌మెంట్ చేసేందుకు సహకరించాలని.. ఇంకా ఆమె ప్రయాణ ఖర్చులు సహా ఇతర వ్యయాలను భరించాలని తనను డిమాండ్ చేసినట్లు ఆ అఫిడవిట్‌లో హీరానందాని పేర్కొన్నారు. తాను చేయకూడని పనులను కూడా చేయమని ఒత్తిడి చేసేదని.. కొన్ని అనుకోని కారణాల వల్ల తనకు వేరే మార్గం లేక చేసినట్లు దర్శన్ హీరానందాని.. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి రాసిన లేఖలో తెలిపారు.