నేడు విజయవాడలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాజం కోసం తన ప్రాణాలను బలిపెట్టడానికి సిద్దపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు ఓ బాధ్యత కూడా అని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యోగం ఓ సవాల్ అని.. ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ ప్రధానాంశమన్నారు. డేటాథెప్ట్, సైబర్ హెరాస్ మెంట్ వరకూ అన్ని అంశాల్లో దర్యాప్తు చేసి శిక్షవేయాలన్నారు. దీనికి మన పోలీసులు ఎంతో అప్డేట్ కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.