ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌లతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్, కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి ఈనెల 18న ఉత్తర్వులిచ్చింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకుగానూ ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది.
మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నవంబర్ 1న జరగనున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం.. ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణస్వీకారానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు.