పాకిస్థాన్‌కు బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ, సామాగ్రిని సరఫరా చేస్తున్న చైనా కంపెనీలపై అమెరికా కొరడా ఝలిపించింది. చైనాకు చెందిన జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, బీజింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్‌మెంట్ కో లిమిటెడ్, చెంగ్జూ యుటెక్ కంపోసైట్ లిమిటెడ్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఈ మూడు సంస్థలు పాక్ బాలిస్టిక్ మిస్సైల్ కార్యాక్రమానికి సహకారం అందజేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గుర్తించింది. ఈ మేరకు ఆ మూడు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. బాలిస్టిక్ మిస్సైల్ రాకెట్ ఇంజిన్లు, కంబషన్ ఛాంబర్స్ ఉత్పత్తిలో ఉపయోగించే బ్రేజింగ్ సామాగ్రిని జనరల్ టెక్నాలజీ సరఫరా చేస్తున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. అలాగే, సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్లలో ఉపయోగించే మాండ్రెల్స్, ఇతర యంత్రాల తయారీలో బీజింగ్ లువో లువో కంపెనీ పనిచేస్తోందని పేర్కొంది. క్షిపణి వ్యవస్థలో ఉపయోగించే డి-గ్లాస్ ఫైబర్, క్వార్ట్జ్ ఫాబ్రిక్, హై సిలికా క్లోత్ వంటి వాటిని 2019 నుంచి చెంగ్జూ యుటెక్ కంపెనీ సరఫరా చేస్తోందని వెల్లడించింది.
సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధాల విస్తరణ, పంపిణీ, సంబంధిత పరికరాల సేకరణ ఎక్కడ జరిగినా.. అలాంటి ఆందోళన కార్యక్రమాలకు వ్యతిరేకిస్తూ వాటిని అమెరికా అడ్డుకుంటుందని ఈ నిర్ణయం నిరూపించినట్లు పేర్కొంది. ‘ఈ రోజు మేము కార్యనిర్వాహక ఉత్తర్వు 13382 ప్రకారం మూడు ఎంటిటీలను నిషేధిస్తున్నాం.. ఇది సామూహిక విధ్వంసక ఆయుధాలు.. వాటి డెలివరీ మార్గాలను విస్తరించేవారిని లక్ష్యంగా చేసుకుంటుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఉన్న ఈ మూడు సంస్థలు.. పాక్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను సరఫరా చేయడానికి పనిచేశాయి’ అని ప్రకటనలో పేర్కొంది. అయితే, అమెరికా చర్యలపై వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ ఇంత వరకు స్పందించలేదు. ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీలు సైతం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పాకిస్థాన్‌కు అత్యంత ఆప్త మిత్రుడైన చైనా.. దాయాది సైనిక అధునికీకర కార్యక్రమాలకు ప్రధానంగా ఆయుధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తుంది. పాక్ అబీల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించిన కొద్ది రోజుల్లోనే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడం గమనార్హం.