తమ వద్ద బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. మానవతాదృక్పథంతో ఈ ఇద్దర్నీ విడుదల చేసినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఖతార్, ఈజిప్టులతో సంప్రదింపుల అనంతరం మానవతా కోణంలో భాగంగా అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ విడుదల చేసినట్లు టెలిగ్రామ్‌లో పోస్టు చేసింది. అయితే వారిని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. చెర నుంచి విడుదలైన బందీలను జుడిత్ తై రానన్, ఆమె కుమార్తె నటాలీ శోషనా రానన్‌గా గుర్తించారు.
ఇద్దరు అమెరికన్ల విడుదలను ఇజ్రాయేల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మిలిటెంట్ల స్థావరం నుంచి విడుదలైన అనంతరం.. శుక్రవారం రాత్రి ఇరువురూ ఇజ్రాయేల్‌కు చేరుకున్నట్టు తెలిపింది. ఈ వార్తపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. చాలా హ్యాపీగా ఉందన్నారు. వారితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బందీలను విడిపించేందుకు ఖతార్, ఈజిప్ట్‌తో కలిసి పని చేస్తున్నట్టు హమాస్ తెలిపింది. మరింత మందిని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
హమాస్ చెర నుంచి విడుదలైన తల్లీకూతుళ్లను గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ రాయబారి కలుసుకున్నారు. వారి కుటుంబం వేచి చూస్తోన్న సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరానికి తరలించారు. అక్టోబరు 7న ఇజ్రాయేల్-గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ కిబ్బుట్జ్ నుంచి ఇరువుర్నీ హమాస్ అపహరించింది. ఆ సమయంలో సెలవులపై ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు సమాచారం. చాలా మంది బందీల మాదిరిగానే రానాన్ కుటుంబం కూడా వారిని హమాస్ నుంచి విడిపించడం కోసం అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. తన తల్లి, సోదరి విడుదలపై నటాలీ సోదరుడు బెన్ రానన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీకి కృతజ్ఞతలు.. తమ వారి కోసం విడుదల కోసం చేసిన ప్రార్థనలు ఫలించాయి’ అని తెలిపాడు.
‘సముచితమైన భద్రతా పరిస్థితులు అనుమతిస్తే బందీలను విడుదల నిర్ణయాన్ని అమలు చేయడానికి అన్ని మధ్యవర్తులతో కలిసి పనిచేస్తాం’ అని ప్రకటించిన హమాస్.. తన డిమాండ్ల వివరాలేవీ ఇవ్వలేదు. 75 ఏళ్ల ఇజ్రాయేల్ చరిత్రలో అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి అత్యంత ఘోరమైంది. హమాస్ 1,400 మంది ఇజ్రాయేలీ పౌరులను ఊచకోత కోసింది. 203 మందిని ముష్కరులు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు, గాజాలో హమాస్ బందీలుగా ఉన్న పౌరుల్లో చాలా మంది సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం పేర్కొంది. హమాస్ దాడి సమయంలో చనిపోయిన వారి మృతదేహాలను సైతం మిలిటెంట్ గ్రూప్ గాజా స్ట్రిప్‌కు తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.