ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి సుపరిచితమైన వ్యక్తి. రాజమండ్రి ఎంపీగా పని చేసిన ఆయన.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకరైన ఆయన.. రాజీవ్ గాంధీకి, ఆ తర్వాత సోనియా గాంధీకి అనువాదకుడిగా పని చేశారు. విభజన కథ పేరిట ఓ పుస్తకం రాసిన ఆయన.. ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలను విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి.. వర్తమాన రాజకీయాలను తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన అభిప్రాయాలను ఆయన వెల్లడిస్తుంటారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండవల్లి అందరూ అభిమానిస్తుంటారు. చాలా మంది ఆయన్నో మేధావిగా చూస్తుంటారు.
కానీ ఓ ఇంటర్వ్యూలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల గురించి చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగులు ఆయన్ను ట్రోల్ చేయడానికి కారణం అయ్యాయి. ‘టైపింగే కదా సాఫ్ట్‌వేర్ అంటే.. టైపిస్ట్ పోస్టులకు అందరూ వెళ్లిపోయారు. ఎక్కువ ఉద్యోగాలు నార్త్ వాళ్ల కంటే సౌత్ వాళ్లకు వచ్చాయి. నార్త్ వాళ్లకు రాదు ఇంగ్లిష్’ అంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలీదు గానీ.. 17 సెకన్ల క్లిప్‌ను మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉండవల్లి వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగులకు ఆగ్రహం తెప్పించాయి. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే టైపింగా..? అంటూ మాజీ ఎంపీపై సెటైర్లు వేస్తున్నారు. ఈయన్నేదో మేధావి అనుకున్నాం. కానీ ఇలా మాట్లాడుతున్నారేంటి అంటూ.. ఉండవల్లిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.
ఉండవల్లి మాటలతో తీవ్రంగా హర్ట్ అయిన కొందరు ఐటీ ఉద్యోగులు.. సాఫ్ట్ వేర్ రంగం రేంజ్ ఏంటో తెలిసేలా పోస్టులు చేస్తున్నారు. ‘ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగం విలువ 60 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.48 లక్షల కోట్లు. భారతదేశ సాఫ్ట్ వేర్ రంగం విలువ 8.5 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.6.8 లక్షల కోట్లు’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అన్నట్టు మరో విషయం ఏంటంటే ట్రోలింగ్ చేసే వాళ్లలో అధికులు ఓ పార్టీ పట్ల సానుభూతి ఉన్నవారే. ఉండవల్లి ఎప్పుడు దొరకుతాడా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు వాళ్లు కూడా.