మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. అయితే జైలుకు వెళ్లాక తొలి పండుగ దసరాను జైల్లోనే జరుపుకుంటున్నారు. దసరా కంటే ముందుగానే జైలు నుంచి విడుదల అవుతారని భావించినా చంద్రబాబుతో పాటూ తెలుగు తమ్ముళ్లకు నిరాశ తప్పలేదు. అయితే చంద్రబాబు పేరుతో దసరా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను కూడా విడుదల చేశారు. అంతేకాదు దసరాకు మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించారు.. కానీ చంద్రబాబు జైల్లో ఉండటంతో వాయిదా పడింది. దీనికి తోడు జనసేన పార్టీతో పొత్తు ఖాయం కావడంతో మేనిఫెస్టో అంశం పెండింగ్ పడింది.
రెండు పార్టీలు ఉమ్మడిగా మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నాయి. అయితే టీడీపీ ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను ప్రకటించింది. ఆ అంశాన్ని ఇప్పటికే టీడీపీ పవన్ కళ్యాణ్‌కు వివరించారు.. ఇకపై మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉండటంతో జనసేన, టీడీపీలు ఇకపై జనాల్లోనే ఉండాలని నిర్ణయించాయి. మరోవైపు చంద్రబాబు, తెలుగు తమ్ముళ్ల ఆశలన్నీ సుప్రీం కోర్టు క్వాష్ పిటిషన్ తీర్పుపైనే ఉంది. వచ్చే నెల 8లోపు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో అందరిలో ఉత్కంఠ రేపుతోంది. అయితే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ అంశం కూడా క్వాష్ పిటిషన్‌తో ముడిపడి ఉంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ ఈలోపు జనాల్లోకి వెళుతోంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రతో.. లోకేష్ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో పర్యటనలు చేయనున్నారు.
మొత్తానికి చంద్రబాబుకు దసరా పండుగ జైల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అలాగే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో బెయిల్ పిటిషన్‌పైనా ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేయనుంది.. మరి కోర్టు ఈ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తుందా.. క్వాష్ పిటిషన్‌పై తీర్పు వరకు వేచి చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబుపై నమోదైన ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా ఏపీ హైకోర్టులో వాయిదా పడింది. కోర్టు ఈ విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ అంశాన్ చంద్రబాబు తరఫు లాయర్లు ప్రస్తావించారు. ఈ కేసులో అరెస్టు చేయొద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా.. విచారణ నవంబర్ 7వ తేదీకి కోర్టు వాయిదా వేయడంతో ఏసీబీ కోర్టులో విచారణపై స్టే నవంబర్ 7 వరకు పొడిగించినట్లే అవుతుందంటున్నారు.