తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీగా విరాళం అందించారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ కిషోర్ బాయ్ ఆదివారం రాత్రి అశ్వవాహన సేవలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి డీడీని అందజేశారు. అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ శుక్రవారం టీటీడీ అన్నప్రసాదం విభాగానికి 9.5 టన్నుల బరువు గల రూ.2 లక్షలు విలువైన కూరగాయలను విరాళంగా అందించారు. ఈ కూరగాయలను తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అధికారులకు అందజేశారు.
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు మధురానుభూతితో వాహనసేవల దర్శనం చేసుకున్నారన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భక్తుల కళ్లలో వెలుగులు, మనసు నిండా ఆనందంతో నిండిపోయిందని..శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం చక్రస్నానం తర్వాత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలకమండలి, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల గొప్ప సమన్వయంతో స్నేహపూర్వక వాతావరణంలో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగాయన్నారు. అదేవిధంగా, ఈ కింది వివరాలను ఛైర్మన్ తెలియజేశారు.
ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాలకట్ల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం నాడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారన్నారు. అలాగే యాత్రికులు, తిరుపతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే శ్రీనివాస సేతు, విద్యార్థుల ఉపయోగార్థం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్మించిన అదనపు హాస్టల్ భవనాలను ప్రారంభించారని గుర్తు చేశారు. టీటీడీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంటిస్థలాలను పంపిణీ చేసి వారి సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 250 ఎకరాలు సమీకరించి ఉద్యోగులందరికీ ఇంటిస్థలాలు ఇవ్వాలని ఈవోను, కలెక్టరును ముఖ్యమంత్రి ఆదేశించడం ఉద్యోగులకు గొప్ప బహుమానం అన్నారు.
లక్షలాది మంది సామాన్య భక్తులకు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహనసేవల దర్శనం చేయించామన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ, లడ్డూప్రసాదాలు అందించామన్నారు. వాహనసేవల ముందు మునుపెన్నడూ లేనివిధంగా కళాప్రదర్శనలు గొప్ప ఆకర్షణగా నిలిచాయన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుండి అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలు, జానపద నృత్యాలను ప్రదర్శించిన కళాకారులు భక్తుల అభినందనలు అందుకున్నారన్నారు.
పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకుని ఈ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.కల్యాణవేదిక దగ్గర అనంతపద్మనాభస్వామివారి సెట్టింగుతోపాటు వివిధ విభాగాల ద్వారా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయన్నారు. తిరుమల నాదనీరాజనం, ఆస్థానమండపం వేదికల మీద ప్రముఖ కళాకారులు ఆలపించిన అన్నమయ్య, పురందరదాస సంకీర్తనలు, ధార్మికోపన్యాసాలు భక్తజనాన్ని ఆధ్యాత్మికానందంలో ఓలలాడించాయన్నారు. అలాగే తిరుపతిలోని మహతి ఆడిటోరియం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ఏర్పాటుచేసిన సంగీత, నృత్య కార్యక్రమాలు తిరుపతివాసులను ఆకట్టుకున్నాయన్నారు.
వాహనసేవల ముందు తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించామమన్నారు. ఎస్వీబీసీలోని నాలుగు భాషల ఛానళ్లలో వాహనసేవలతోపాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతిరోజూ సుమారు 9 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు బ్రహ్మోత్సవాల ప్రసారాలను తిలకించారు. తద్వారా ఛానల్ అత్యధిక రేటింగ్‌ను అందుకుందన్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఆగమ పండితుల అనుమతితో తొలిసారిగా గరుడసేవను సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభించామన్నారు.
గరుడసేవ నాడు గ్యాలరీల్లోకి రాలేని భక్తుల సౌలభ్యం కొరకు సుపథం, వసంతమండపం, మేదరమిట్ట, అన్నదానం కాంప్లెక్స్ ప్రాంతాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించామన్నారు. గరుడసేవరోజు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఆ రోజున వచ్చిన లక్షలాది మంది భక్తులకు పలురకాల అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు, టీ, కాఫీ పంపిణీ చేశాం. మరుగుదొడ్ల సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది, కళాకారులు, శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్నివిధాలా సహకరించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇతర ప్రభుత్వ విభాగాలకు ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేరువ చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa