బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై - కోల్‌కతా 16వ నెంబరు జాతీయ రహదారిపై తిరుపతి నుంచి విశాఖకు వెళ్తున్న అయ్యప్పల బస్సును వెనుక నుంచి కూరగాయల లారీ ఢీకొట్టింది. విశాఖకు చెందిన అయ్యప్పలు శబరిమల వెళ్లి తిరుగు ప్రయాణంలో తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని సందర్శించుకుని స్వగ్రామాని వెళుతున్నారు. మార్టూరు దగ్గరకు రాగానే బెంగళూరు నుంచి విజయవాడకు కూరగాయల సరకుతో ప్రయాణిస్తున్న మినీ లారీ, బస్సు వెనుక బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం దగ్గర లారీ నిలిచిపోగా దాని తాకిడికి గురైన బస్సు సుమారు 100 మీటర్ల దూరం హైవేపై ముందుకు వెళ్లి ఆగింది.
ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం, లారీ ముందు క్యాబిన్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బస్సులోని పలువురు స్వల్ప గాయాలతో బయటపడగా.. అప్పలరాజు అనే వ్యక్తి కాలుకు తీవ్ర గాయాలు కావడంతో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, వైద్య సేవలకు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన తెలుసుకున్న హైవే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకుని రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను క్రమబద్దీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని చెబుతున్నారు.