వందే భారత్ స్పెషల్ రైలు మీద రాళ్లు రువ్విన కేసులో ఇద్దర్ని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల శాంతినగర్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 12న చీరాల- స్టువర్టుపురం స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. విచారణ జరిపిన పోలీసులు.. షేక్ తాబ్రాజ్, జెట్టి శశి తరుణ్ అనే యువకులు ఆ రైలుపై రాళ్లు విసిరినట్లు గుర్తించారు. రాళ్లు రువ్వడంతో ఒక బోగీ కిటికీ అద్దాలు పగిలాయి.. ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
చీరాల మీదుగా రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తోంది. అలాగే విజయవాడ నుంచి చెన్నైకు మరో రైలు నడుస్తోంది. అయితే కొందరు ఆకతాయిలు వందేభారత్ రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడుతున్నారు. రైల్వే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో వందేభారత్ రైళ్లపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఇలా వరుస దాడులను దక్షిణ మధ్య రైల్వే సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
రైళ్లపై దాడికి పాల్పడేవారిని హెచ్చరించింది రైల్వేశాఖ. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే రైళ్లపై రాళ్లు రువ్వొద్దని హెచ్చరించారు. రైళ్లపై రాళ్ల దాడి చేయడం ఆర్పీఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమని.. దీనికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ప్రకటనలో తెలిపారు. గతంలో కొన్ని కేసుల్ని కూడా నమోదు చేశారు.