తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సోమవారం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు సోమవారం ముగిశాయి.అదే విధంగా తిరుమల నాదనీరాజనం మండపంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తనల ఆలాపన కార్యక్రమం సోమవారం ముగిసింది ప్రముఖ సంగీత విద్వాంసులు హైదరాబాద్ కు చెందిన శ్రీ రామాచారి తన శిష్యులైన సత్యయామిని, సాహితీ, శ్రియామాధురితో కలిసి అన్నమయ్య సంకీర్తనలను చక్కగా ఆలపించారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో మొదట శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వీణ విభాగ హెడ్ వై శ్రీవాణి వీణావాద్య కచేరి సభను రంజింపజేసింది. కార్యక్రమం -అన్మమాచార్య కీర్తన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ తో ప్రారంభమైంది. ఆపై వాతాపి గణపతిం భజే, చక్కని తల్లికి చాంగుభళా, భాగ్యాద లక్ష్మీబారమ్మ, అయిగిరినందిని నందిత మేధిని, గరుడగమన తవ చరణకమల, భో శంభో శివశంభో, గోవింద నామాలు, జగడపు జనముల జాజర, కురయ్ ఒండ్రుమ్ అన్న కీర్తనలను వీణపై పలికించారు.
తదుపరి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నృత్యవిభాగ అధ్యాపకురాలు పి ఉషారాణి వారి శిష్య బృందంతో సమర్పించిన కూచిపుడి నృత్యప్రదర్శన సభను భక్తిరస సాగరంలో ముంచెత్తింది. తాండవ నృత్యకరి అని గణేశస్తుతితో ఆరంభం కాగా, త్రిమాతలపై, శ్రీచక్ర రాజసుతే లకు గావించిన నృత్యప్రదర్శన సభను ఆకట్టుకుంది. రామచంద్రపుష్కరిణి వేదికలో అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన కె.ఉదయభాస్కర్, జి. లావణ్య గాత్రకచేరి సభాసదులను భక్తిరసవాహినిలో ముంచెత్తింది. వీరికి బాబూరావు తబలా, జాయ్ కీబోర్డు, ఎం.గంగులప్ప శ్రుతిపై సహకారమందించారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య సూరం శ్రీనివాసులు, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, అడిషనల్ ఎఫ్ఏసిఏఓ శ్రీ రవిప్రసాదు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమాముద్దుబాల, అన్నమాచార్య ప్రాజెక్టు పీసీవో డా.లత, తిరుపతిపురవాసులు పాల్గొన్నారు.తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, అనిత బృందం విష్ణుసహస్రనామపారాయణం, శివలీల బృందం భక్తి సంగీతం, ప్రభాకర శర్మ భక్తామృతం ధార్మికోపన్యాసం, సాయంత్రం శ్రీమతి సౌమ్యరేఖ బృందం అన్నమయ్య విన్నపాలు, రాత్రి శ్రీ రవిప్రసాదరాజు బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa