టీటీడీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి లక్ష కుంకుమార్చన సేవకు సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 9న లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.. భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అంతేకాదు వర్చువల్ ద్వారా పాల్గొనే భక్తులు కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసంలో లక్షకుంకుమార్చన సేవ నిర్వహిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్షకుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.
అంతేకాదు టీటీడీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.200/- ప్రత్యేక దర్శన టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ప్రతి రోజూ స్లాట్లను బట్టి గంటకు 200 టికెట్ల లెక్కన రోజుకు 2 వేల టికెట్ వరకు భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్ చేసుకుని వచ్చే భక్తులను సుపథం మార్గం ద్వారా ఆలయంలో దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం వీరికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తారు. టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న భక్తులు వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.