ఏపీలో సామాన్యులకు మరోసారి కూరగాయల ధరలు షాకిస్తున్నాయి. ఒక్కసారిగా మార్కెట్‌లలో రేట్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉల్లి, టమాటా ధరలు మళ్లీ ఆకాశానికేసి చూస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.60కి పైగా చేరగా.. కేజీ టమాటా రూ.30కి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వాటిని ఇంకా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో పంటల సాగు తగ్గింది. అలాగే రైతులు సాగు చేసిన పంటకు నీరు అందకపోవడంతో దిగుబడులు రాని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లోనూ కొత్తగా సాగు చేసిన ఉల్లి పంట ఆశాజనకంగా లేదు.. అందుకే ధరల పెరుగుతున్నాయని చెబుతున్నారు. సాగు తగ్గి, ఉత్పత్తి పడిపోతోంది.. దీంతో ఉల్లి, టమాటా ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మార్కెట్‌లో గతంలో కిలో ఉల్లి రూ.40 ఉండగా ఇప్పుడు రూ.60కు పైగా చేరింది. టమాటా ధర సైతం ఈ నెల 22 నాటితో పోలిస్తే ఒక్కో కిలోపై 50 శాతం పెరిగింది అంటున్నారు.
టమాటా సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రైతులు సాగు తగ్గించుకున్నారు. గతేడాది ఖరీఫ్ నాటితో పోలిస్తే ఈసారి సాగు తగ్గింది. 10 రోజుల నుంచి మదనపల్లె మార్కెట్‌కు సైతం టమాటా రాక తగ్గింది. ఆదివారం మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన టమోటాలు నాణ్యతను బట్టి మొదటి రకం కిలో రూ.27.40, రెండో రకం రూ.20.70, మూడో రకం రూ.14 చొప్పున ధరలు పలికాయి. యార్డుకు రైతులు 23.70 టన్నులు తీసుకురాగా వ్యాపారులు కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న నగరాలకు తరలించారు. పలమనేరు మార్కెట్‌లో మొదటిరకం కిలో రూ.21, రెండో రకం రూ.16, మూడోరకం రూ.12 ధర పలకగా యార్డుకు 42.01 టన్నుల టమోటాలను విక్రయాలకు రైతులు తీసుకొచ్చారు. వి.కోటలో మొదటి రకం కిలో రూ.22, రెండో రకం రూ.17, మూడోరకం కిలో రూ.12 చొప్పున విక్రయాలు జరిగాయి. మార్కెట్‌లలో ధరలు ఇలా ఉంటే.. సామాన్యులకు చేరే సరికి కేజీ రూ.30 వరకు పలుకుతోంది.
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో కూడా టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ రూ.200 మార్కు కూడా అందుకుంది. ఆ తర్వాత మెల్లిగా ధరలు పతనం అయ్యాయి.. గిట్టుబాటు ధరలేక రైతులు పంటను రోడ్డుపై పారబోసిన ఘటనలు కూడా జరిగాయి. మళ్లీ ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి.