ఆంధ్రప్రదేశ్‌ను ఉలిక్కిపడేలా చేసిన విజయనగరం రైలు ప్రమాదం.. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది వరకు గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను చాలా బాధించిందని తెలిపారు. అప్పటికే ఆగి ఉన్న ఓ రైలును.. అదే దిశలో ప్రయాణిస్తున్న మరో రైలు ఢీకొట్టటంతో ఈ భయంకరమైన ప్రమాదం సంభించిందని పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రమాదం జరిగిన తీరు.. పలు అనుమానాలకు తావిస్తోందంటూ.. ట్విట్టర్ వేదికగా కేంద్రానికి మూడు ప్రశ్నలను సంధించారు సీఎం జగన్.
జగన్ లేవనెత్తిన ప్రశ్నలివే..
1. బ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు?
2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది?
3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది?
ఈ ప్రశ్నలను లేవనెత్తిన సీఎం జగన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ.. భవిష్యత్తులో ఇలాంటి భయనక ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఈ మార్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే మార్గాల్లో.. తాను లేవనెత్తిన ప్రశ్నలతో పాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి.
మరోవైపు.. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆ బాధ తట్టుకునే ధైర్యం అందించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు జగన్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
అంతకు ముందు.. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి మరీ.. పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నా పెద్ద అందరినీ ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల వరకు పరిహారం అందించనున్నట్టు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిచనున్నట్టు తెలిపారు. కాగా.. క్షతగాత్రులకు పూర్తి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు.