ఏపీలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ గ్రౌండ్ వర్క్ మొదలు పెడుతోంది.. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి ఫరూక్‌ను బరిలో దింపాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోందట.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వహీద్‌కు.. కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట.
2014 ఎన్నికల్లో నంద్యాల నుంచి భూమా విజయం సాధించింది. 2017 ఉప ఎన్నికల్లో.. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కేటాయించినా.. ఓడిపోయారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పార్టీలో మైనారిటీ వర్గాల ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోఈ సీటును ముస్లిం సామాజికవర్గానికి కేటాయించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు చెబుతున్నారు. నంద్యాల నుంచి మాజీ మంత్రి ఫరూక్ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వహీద్ కర్నూలు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడ టీజీ భరత్‌ను మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైనారిటీ వర్గంలో గట్టి పట్టున్న వహీద్ సేవల్ని వచ్చే ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోందట.
నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు భూమా కుటుంబానికి అడ్డాగా ఉంది. గతంలో టీడీపీలో ఉన్న భూమా కుటుంబం 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో భూమా కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి కన్నుమూశారు.. అయితే భూమవారి రాజకీయ వారసురాలిగా అఖిలప్రియ ఆళ్లగడ్డలో పోటీచేసి విజయం సాధించారు. అలాగే భూమా నాగిరెడ్డి నంద్యాలలో గెలుపొందారు.. అయితే 2014 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలతో నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీలో చేరారు.
ఆ తర్వాత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చింది.. భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇటు చంద్రబాబు కూడా భూమా అఖిలప్రియకు మంత్రి పదవి అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ.. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డిలు పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే కొంతకాలంగా బ్రహ్మానందరెడ్డి.. భూమా అఖిలతో గ్యాప్ ఉన్నట్లు చెబుతున్నారు. నంద్యాల సీటు కోసం భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్, భూమా జగత్‌విఖ్యాత్ కూడా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఫరూక్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.