ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలపై స్పష్టత,,,వచ్చే నెలలో పక్కా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 04:36 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, ఇతర బకాయిలను ప్రభుత్వం నవంబరులోగా చెల్లిస్తుందని ఆశిస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం దసరా ముందే ఒక డీఏ బకాయి చెల్లించారని.. పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌) ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుందనే జీపీఎస్‌ తీసుకొచ్చారన్నారు. ఉద్యోగులకు ఇది ఎంతో మేలైంది.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 12వ పీఆర్‌సీ కమిషన్‌ ఇప్పటికే పని ప్రారంభించింది అన్నారు. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ రామ్‌సింగ్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన సుధీర్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన దుండగులకు బెయిల్‌ రాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. డ్రైవర్‌ రామ్‌సింగ్‌పై జరిగిన దాడితో యావత్‌ ఆర్టీసీ ఉద్యోగులు భయానక పరిస్థితిలోకి వెళ్లిపోయారన్నారు. వారికి తిరిగి మనోస్థైర్యాన్ని కల్పించాలంటే.. దాడులకు తెగబడిన వారికి బెయిల్‌ కూడా రాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై ఇటీవల కాలంలో రాష్ట్రంలో తరచూ దాడులు జరుగుతున్నాయన్నారు ఏపీపీటీడీ ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి. వీటిలో కావలి ఉదంతం చాలా పెద్దదని.. తగినంత సిబ్బంది లేకపోయినా.. ఓవర్‌టైమ్‌ డ్యూటీలు చేస్తూ సంస్థ అభివృద్ధి కోసం అహరహరం కృషి చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులకు 2017 వేతన బకాయిలు, ఆర్టీసీ నుంచి రూ. 500 కోట్ల వరకు చెల్లింపులు ఆగిపోవటం వల్ల ఈపీఎఫ్‌ ద్వారా హయ్యర్‌ పెన్షన్‌ సౌకర్యాన్ని కూడా కోల్పోతున్నారన్నారు.


ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై దాడి చేసిన దుండగులపై పెట్టిన కేసును విజయవాడ కోర్టుకు బదిలీ చేయాలని ఏపీపీటీడీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.దామోదరరావు డిమాండ్‌ చేశారు. కేసు కావలి కోర్టులో ఉంటే.. విచారణ సమయంలో దుండగుల వల్ల డ్రైవర్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌ను ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లిఖార్జున రెడ్డి పరామర్శించారు. విజయవాడలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంసింగ్‌ను ఆయన కలిసి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, దుండగులపై క ఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన సేవలను అందించాలని ఆసుపత్రి సీఎంవో అప్పారావును ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా అందరిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు.


మరోవైపు విద్యుత్‌ సంస్థల మధ్య సిబ్బంది బదిలీలను హెచ్‌ఆర్‌ కమిటీ ఆమోదించి, వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపడం ఆమోదయోగ్యం కాదని ఏపీఎస్‌ఈబీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అంటోంది. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేసింది. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు వేర్వేరు చట్టబద్ధ కంపెనీలని, వాటి మధ్య సిబ్బంది బదిలీలకు ఆమోదం తెలపడం న్యాయపరంగా చెల్లుబాటు కాదంటున్నారు. ఈ మేరకు వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. వివిధ డిమాండ్లపై యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించ లేదని.. దీనికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామంది. అందులో భాగంగా నవంబరు 6 వరకు నల్ల బ్యాడ్జీలతో సిబ్బంది విధులకు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను తెరపైకి తెచ్చారు.


కొత్త జిల్లాల ఆధారంగా సర్కిళ్లు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న 1,200 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే సిబ్బందికి నగదు రహిత వైద్య సేవల పథకాన్ని వర్తింపజేయాలి అన్నారు. సిబ్బందికి అలవెన్సుల చెల్లింపు విధానంలో మార్పుల కారణంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని.. తక్షణం వాటిని ఉపసంహరించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa