స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయి.. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిల్ మీద విడుదలయ్యారు. 5 కండీషన్లతో కూడిన 4 వారాల బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయటంతో.. చంద్రబాబు విడుదలయ్యారు. 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. తన మనుమడు దేవాన్ష్‌ను ఎమోషనల్‌గా గుండెలకు హత్తుకుని ముద్దాడారు. అనంతరం.. పార్టీ సీనియర్ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు తన అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించిన మాట్లాడారు. తాను కష్టంలో ఉన్నప్పుడు తనకు మద్దతుగా, సంఘీభావం ప్రకటించిన కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ పార్టీలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పేరు పేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడినంటూ చెప్పుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తన మీద ప్రజలు చూపించిన అభిమానంతో తన జీవితం ధన్యమైందని చంద్రబాబు తెలిపారు.
"నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు మీరంతా తోడుగా ఉన్నారు. ఎక్కడికక్కడా నా ఆరోగ్యం బాగుండాలని పూజలు, ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లోని అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా నాకు అండగా ఉన్నారు. నాకోసం ఎక్కడిక్కడా రోడ్డు మీదికొచ్చి సంఘీభావం ప్రకటించారు. మీ అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన విధానాల వల్ల ఏదో రకంగా లబ్ది పొందిన వాళ్లంతా.. రోడ్డు మీదికొచ్చి సంఘీభావం వ్యక్తం చేశారు. వాళ్లందికీ నా ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా సంఘీభావం వ్యక్తం చేయటం, నా మీద వారికున్న అభిమానాన్ని చూపించటంతో నా జీవితం ధన్యమైంది." అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
45 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఎక్కడా తప్పు చేయలేదని.. చేయనని.. చేయబోననంటూ.. చంద్రబాబు స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం ఏంటో తెలుగు ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. అభిమానులే కాదు.. రాజకీయ పార్టీలు కూడా తనకు సంఘీభావం తెలిజేశాయన్న చంద్రబాబు వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు.
శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తలను కూడా చంద్రబాబు ప్రస్తవించి అభినందించారు చంద్రబాబు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు సంఘీ భావం వ్యక్తం చేయటం అభినందనీయమని.. హైటెక్ సిటీ నిర్మించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంతో యువత అంతా కలిసి తనకు మద్దతు ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు.