ఓ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది.. భార్య బతికి ఉండగానే చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం పొంది, ఆమె పేరిట ఉన్న నాలుగు సెంట్ల స్థలాన్ని తన సోదరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం హజత్ గూడేనికి చెందిన తిప్పబోయిన శివశంకరయ్య ఏపీఎస్పీ మంగళగిరి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాధవితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు.
గతంలో మాధవి పేరిట నంద్యాల మండలం రైతునగరం ప్రాంతంలో నాలుగు సెంట్ల స్థలాన్ని శివశంకరయ్య కొని రిజిస్ట్రేషన్ చేయించాడు. మూడేళ్ల క్రితం భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. మాధవి ప్రస్తుతం తన ఇద్దరు కుమారులతో గుంటూరులోని తన తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. నంద్యాలలో భార్య పేరిట ఉన్న స్థలానికి మార్కెట్‌లో ధర పెరగడంతో దాన్ని తన సొంతం చేసుకోవాలని శివశంకరయ్య కన్నింగ్ ప్లాన్ చేశాడు.
తాను గిద్దలూరు మండలం మండ్లపాడుకు చెందిన వాడినని.. తన భార్య గిద్దలూరు ఆసుపత్రిలో 2019 జూలై 14న అనారోగ్యంతో చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు డెత్ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లు చూపుతూ.. తన భార్య మాధవి ఆస్తికి తానే వారసుడినని 2019లో డిసెంబరులో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు. 2022 మార్చి 1న మండ్లపాడులోని తన సోదరి ఎర్రబోయిన ఆదిలక్ష్మి పేరిట శివశంకరయ్య ఆ నాలుగు సెంట్ల స్థలాన్ని రిజిస్టర్ చేయించాడు.
ఆ స్థలాన్ని అమ్మేయాలనే ఆలోచనతో ఉన్న విషయం తెలుసుకున్న మాధవి ఈనెల 27న నంద్యాల రూరల్ పోలీసుస్టేషన్‌లో శివశంకరయ్య, అతడి సోదరి ఆదిలక్ష్మిలపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా డెత్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారనే ప్రశ్న వినిపిస్తోంది. కానిస్టేబుల్ శంకరయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. భార్య బతికుండగానే ఆస్తి కోసం ఇలా దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.