దేశంలోని ప్రతిపక్షాలకు చెందిన ఐఫోన్లకు హ్యాకింగ్ అలర్ట్ రావడం.. అది రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వేళ.. ఈ అంశంపై ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ కంపెనీ స్పందించింది. అసలు ఈ అలర్ట్ మెసేజ్‌లు ఎందుకు వచ్చాయి అనే దానిపై స్పష్టతనిచ్చింది. ఆపిల్ యూజర్లకు ఒక్కోసారి తప్పుడు అలర్ట్ మెసేజ్‌లు కూడా వస్తుంటాయని కంపెనీ పేర్కొంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు కూడా ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినట్లు తెలిసింది.
దేశవ్యాప్తంగా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ఐఫోన్లకు మంగళవారం హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వారి ఐఫోన్లకు అలర్ట్ రావడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్.. తమపై నిఘా ఉంచి తమ ఫోన్లను ట్యాప్ చేస్తుంది అంటూ విపక్షాలు, నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే ఈ వ్యవహారంపై భారత్‌లో తీవ్ర వివాదాస్పదమై.. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న క్రమంలోనే ఆపిల్ సంస్థ ఈ ఘటనపై స్పందించింది. ఐఫోన్లపై అలాంటి హ్యాకింగ్ ప్రయత్నం ఏదీ జరగలేదని ఆపిల్ స్పష్టం చేసింది. ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా ఇలాంటి నోటిఫికేషన్ల రూపంలో ఫోన్లకు వస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆపిల్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్లను అధికారిక హ్యాకర్లు చేసినట్లు స్పష్టంగా చెప్పలేదమని తెలిపింది. హ్యాకింగ్ చేసేందుకు అధికారిక హ్యాకర్లు హై టెక్నాలజీని వాడతారని..వాటికి నిధులు, టెక్నాలజీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
అయితే ప్రభుత్వ అధికారిక హ్యాకర్ల దాడులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని.. ఇలాంటి హ్యాకింగ్ దాడులను గుర్తించడం అనేది నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఆపిల్ ఫోన్లకు వచ్చే అలర్ట్‌లు ఒక్కోసారి నకిలీవి కూడా ఉండొచ్చని.. మరికొన్ని దాడులను గుర్తించలేమని ఆపిల్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని ప్రతిపక్ష ఎంపీలకు మంగళవారు హ్యాక్ అలర్ట్ మెసేజ్‌లు ఎందుకు వచ్చాయన్న దానిపై స్పందించేందుకు మాత్రం ఆపిల్ కంపెనీ నిరాకరించింది. అయితే ఈ అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి గల కారణాలను మాత్రం తాము వెల్లడించలేమని.. ఒకవేళ అలా చెప్తే ఆ హ్యాకర్లు భవిష్యత్తులో తమ నిఘా నుంచి తప్పించుకునే అవకాశముందని కంపెనీ స్పష్టం చేసింది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన చాలామంది ఐఫోన్ యూజర్లకు ఈ అలర్ట్ నోటిఫికేషన్లు వచ్చినట్లు ఆపిల్ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు మంగళవారం ఉదయం ఈ హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆ హ్యాకింగ్ అలర్ట్‌కు చెందిన సమాచారాన్ని స్కీన్‌షాట్ తీసి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అలర్ట్ వచ్చిన వారిలో కాంగ్రెస్ నేతలు శశిథరూర్, పవన్ ఖేరా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా సహా చాలా మంది ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొట్టిపారేశారు. ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించామని.. ఈ మెసేజ్‌లు వచ్చినవారు దర్యాప్తుకు సహకరించాలని కోరారు.