అంబటిపై దాడి జరిగింది ఎక్కడా అంటూ సినీ నిర్మాత నట్టికుమార్ ప్రశ్నించారు. ఇదిలావుంటే ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ నిరసన సెగ తగలడం తెలిసిందే. అయితే, అంబటి రాంబాబు కుల ప్రస్తావన తీసుకురావడమే కాకుండా, తనకూ ఓ కులం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని నారా లోకేశ్ ను హెచ్చరించారు. తనపై దాడి వెనుక ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు. కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారని, టీడీపీని నాశనం చేస్తున్నారని అన్నారు. అయితే, అంబటి రాంబాబు వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు. ఓ వైసీపీ మంత్రిగా అంబటి రాంబాబు ఖమ్మం వెళ్లారని, ఆ సమయంలో అక్కడ టీడీపీ ర్యాలీ జరుగుతోందని, వారు మంత్రిని చూసి ఏదో మాట్లాడినట్టు టీవీలో చూపించారని వెల్లడించారు. మరి, అంబటిపై దాడి జరిగింది ఎక్కడని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఒకవేళ ఆయనపై దాడి జరిగితే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేస్తారు కదా అని అన్నారు.
"మీరు (అంబటి) ఖమ్మం వెళ్లింది వైసీపీ మంత్రిగా... అక్కడ ర్యాలీ చేస్తోంది టీడీపీ వాళ్లు. దీనికి కమ్మ-కాపు అంటూ ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మధ్యలో పవన్ కల్యాణ్ ను తిట్టడం ఏంటి? చంద్రబాబును మీరు అసభ్యంగా తిడుతున్నారు కాబట్టి వాళ్ల కార్యకర్తలకు కోపం వస్తుంది. అందుకే ఖమ్మంలో మీరు కనపడగానే డౌన్ డౌన్ అన్నారు. అంతే తప్ప మీపై దాడి జరగలేదు. కానీ మీరేమో దీన్ని పవన్ కల్యాణ్ కు, కాపులకు ముడివేస్తున్నారు. కాపు యువత పవన్ కల్యాణ్ ఉచ్చులో పడొద్దంటారు. నేను కూడా కాపునే. నేను కాపు బిడ్డగా, కాపు నాయకుడిగా చెబుతున్నాను. మీరు వైసీపీ నేతగా మాట్లాడితే బాగుంటుంది. దాడులు చేయాలని, అసభ్యంగా మాట్లాడాలని చంద్రబాబు ఎప్పుడూ చెప్పరు. నేను చెప్పేది ఏంటంటే... ఇక్కడ కాపులను, కమ్మలను కలపకండి... వైసీపీ-టీడీపీ లేకపోతే వైసీపీ-తెలంగాణ టీడీపీ కోణంలోనే చూడండి. అంతేతప్ప, ఓ కాపుపై దాడి జరిగితే మిగతా కాపులు ఖండించరేంటని మీరు అడుగుతున్నారు. మీరు కాపు నేత కాదు... మీరు వైసీపీ మంత్రి" అంటూ నట్టి కుమార్ ధ్వజమెత్తారు.