కరువు మండలాల ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టైమ్ గడిచిపోయాక కరువు మండలాల ప్రకటన చేశారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు మండలాలను ప్రకటిస్తూ జారీ చేసిన జీవో 4 ఎందుకూ పనికి రాదన్నారు. ఈ ప్రభుత్వం కరవు నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరువు మండలాలను ప్రకటించారని విమర్శించారు. అక్టోబర్-30లోగా ప్రకటించాలని డ్రాట్ మాన్యువల్ స్పష్టం చేస్తోందని.. కానీ జగన్ ప్రభుత్వం అక్టోబర్-31న జీవో జారీ చేశారన్నారు. కరువు మండలాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నాలుక గీసుకోవడానికి పనికి రాదంటూ వ్యాఖ్యలు చేశారు. రైతులను మోసం చేసేలా కరువు మండలాల ప్రకటన ఉందన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి కరువు బృందాలు ఎలా వస్తాయని.. కేంద్రం ఎలా సాయం చేస్తుందని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కరువు వల్ల రూ.30 వేల కోట్ల నష్టం వచ్చిందని కేంద్రానికి నివేదించిందని.. కరువు నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు సిద్దం చేయడం లేదని ఆయన నిలదీశారు.