ఈశాన్య రుతుపవనాల చురుకుగా మారినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీని ప్రభావంతో దక్షిణాదిలోని తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది. శనివారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో ఎగతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులపాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో తమిళనాడు, కేరళలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని పతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
వచ్చే ఏడు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ కర్ణాటకలలో ప్రభావితమవుతాయని చెప్పింది. వర్షాల వల్ల తమిళనాడులోని పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాబోయే 3 రోజులు చెన్నై, కన్యాకుమారి, టెంకాసీ, థేని, మధురై, తిరునల్వేలి, దిండిగల్, తిరునాల్వేలి, కోయంబత్తూరు, దిండుగళ్, విరుద్‌నగర్, శివగంగ, పుదుక్కొట్టైయ్, తిరుప్పూరు, నీల్‌గిరీస్, ఈరోడ్, ధర్మపురి, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. దీంతో ఈ జిల్లాలో విద్యా సంస్థలను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేశారు.
గడచిన 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెం.మీ. .. అన్నామలై నగర్, మంజోలై, రాధాపూర్, కకచ్చిలో 7 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. అటు, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అటు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక, ఈశాన్య రుతుపవనాల ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంటుంది. రాయలసీమ జిల్లాలోనూ ఈ రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి.