సాధారణంగా మనం చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉంటాం. అయితే కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేసి ప్రక్రియ మొత్తం సక్రమంగా పూర్తయితే తొందర్లోనే ఉద్యోగాలు వస్తాయి. కానీ కొన్ని మాత్రం ఏళ్లకు ఏళ్లు సాగుతూనే ఉంటాయి. అయితే ఓ వ్యక్తి ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 7 సంవత్సరాల తర్వాత ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చింది. దీంతో అది చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ వింత పరిస్థితి పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.
2016 లో పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ శాఖలోని అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఆ రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. 2016 మార్చిలో దినపత్రికలో ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే ఈ ఉద్యోగానికి అర్హత కలిగిన వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి సంబంధించి గానీ.. రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు సంబంధించి గానీ ఆశిష్ బెనర్జీకి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఆశిష్ బెనర్జీ కూడా దాన్ని వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత అసలు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు.
అయితే తాజాగా ఇటీవల ఈ నెల 1వ తేదీన ఆశిష్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ నుంచి ఒక ఉత్తరం అందింది. అయితే తనకు అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్ నుంచి లెటర్ రావడంతో ముందు ఆశిష్ బెనర్జీ ఆశ్చర్యపోయాడు. ఆ లెటర్‌లో ఉన్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తాను 7 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించిన అడ్మిట్ కార్డు.. ఇంత కాలానికి తనకు చేరింది.
అయితే ఆ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షను 2016 డిసెంబరు 18 వ తేదీనే నిర్వహించారు. ఆ రిక్రూట్‌మెంట్ పూర్తి అయిపోయి.. దానికి అప్లై చేసుకున్న వారిలో సెలక్ట్ అయిన వారు ఉద్యోగంలో చేరి సీనియర్లు కూడా అయ్యారు. అంటే పరీక్ష నిర్వహించిన 7 ఏళ్ల తర్వాత తనకు అడ్మిట్ కార్డు రావడంతో ఆశిష్ బెనర్జీ షాక్ అయ్యాడు. అయితే ఈ ఘటనపై బాధితుడు ఆశిష్ బెనర్జీ.. స్థానిక మీడియాతో మాట్లాడాడు. తనకు అడ్మిట్ కార్డు ఆలస్యం కావడానికి కారణం ఏమిటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశాడు.
అయితే పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల పలు ఉద్యోగ నియామక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటన జరగడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇది కూడా జాబ్ స్కామ్‌లో భాగమేనని బెంగాల్‌లోని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార టీఎంసీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై సమాధానం చెప్పాలని సీఎం మమతా బెనర్జీని ప్రశ్నించారు. దీంతో ఈ ఘటన కాస్తా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.