బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఆంటీ అని పిలవడమే ఆ బస్ కండక్టర్ చేసిన పెద్ద తప్పు అయిపోయింది. వయసు ఎక్కువ ఉన్న మహిళ కాబట్టి సాధారణంగా ఆమెను ఆంటీ అని పిలిచిన పాపానికి పడరాని పాట్లు పడుతున్నాడు ఆ కండక్టర్. అయితే చిన్న గొడవగా ప్రారంభమైన ఈ వ్యవహారం.. ఆ కండక్టర్‌ను కొట్టడంతో ఆగకుండా చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. దీంతో ఆ కండక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
తమిళనాడుకు చెందిన 57 ఏళ్ల నిర్మలాదేవి తాజాగా బస్సు ఎక్కింది. చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులో మింట్ నుంచి రెడ్ హిల్స్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే అదే బస్సులో కండక్టర్‌గా ఉన్న కార్తిక్.. నిర్మలా దేవి వద్దకు వెళ్లి "ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ" అంటూ పలకరించాడు. అంతటితో ఆగకుండా “టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వండి ఆంటీ” అంటూ మరోసారి ఆంటీ అనే పదం ఉపయోగించాడు. దీంతో నిర్మలా దేవికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తనను ఆంటీ అని పిలవద్దు అని ఆ కండక్టర్ కార్తిక్‌కు చెప్పింది. అయితే ఆ బస్సులో జనం ఎక్కువగా ఉండటంతో ఆమె చెప్పిన విషయం అతనికి వినబడలేదు. ఆ తర్వాత కూడా మరోసారి ఆంటీ అంటూ ఆ కండక్టర్ పిలిచాడు.
తాను ఆంటీ అని పిలవద్దు అని చెప్పినప్పటికీ పదే పదే కండక్టర్ కార్తిక్ అలాగే చేయడంతో నిర్మలా దేవికి ఆగ్రహం మరింత పెరిగిపోయింది. వెంటనే సీటులో కూర్చున్న ఆమె.. పైకి లేచి కండక్టర్ చెంపలు చెల్లుమనిపించింది. అంతటితో ఆగకుండా వెంటనే జరిగిన విషయాన్ని మొత్తం తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో తాను దిగాల్సిన బస్‌స్టాప్ అయిన రెడ్ హిల్స్ వద్దకు బస్సు చేరుకునే సమయానికి నిర్మలా దేవి భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు.
బస్సు ఆగిన వెంటనే అందులోకి ఎక్కిన నిర్మలా దేవి భర్త.. కండక్టర్‌పై దాడి చేశాడు. అనంతరం నిర్మలా దేవి, ఆమె భర్త ఇద్దరూ కలిసి స్థానికంగా ఉన్న రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయం అంతా చెప్పి.. మహిళా వేధింపుల సెక్షన్ కింద కండక్టర్ కార్తిక్‌పై కేసు నమోదు చేశారు. నలుగురిలో తన గౌరవానికి భంగం కలిగించాడని.. కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసిన పోలీసులు.. కండక్టర్ కార్తిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరేమో ఆ మహిళ 57 ఏళ్లు ఉందని.. ఆంటీ అంటే తప్పేముందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరేమో ఆంటీ అని పిలవాల్సిన అవసరం ఏముంది అంటూ కండక్టర్ తీరు పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.