కన్నడ రాజకీయాల్లో రోజుకో కొత్త రకమైన ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం సీటు గురించి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తుండగా.. అదేమీ లేదని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. అయినా ఈ ఊహగానాలకు బ్రేక్ పడటం లేదు. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ డీకే శివకుమార్ సీఎం కావాలని భావిస్తే.. జేడీఎస్ ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారని పేర్కొనడం సరికొత్త రాజకీయ ప్రకంపనలకు తెరతీసింది. అయితే ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. దాని ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేత సీఎం అయ్యేందుకు మద్దతు పలుకుతామని ప్రకటించడం సర్వత్రా ఉత్కంఠకు తెరలేపింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తమ పార్టీ మద్దతునిస్తుందని శనివారం జేడీఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హెచ్‌డీ కుమారస్వామి ఈ ప్రకటన చేశారు. జేడీఎస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేల మద్దతు డీకే శివకుమార్‌కు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ సందర్భంగా కర్ణాటకలో టెంపరరీ చీఫ్ మినిస్టర్(టీసీఎం), డూప్లికేట్ చీఫ్ మినిస్టర్(డీసీఎం) పాలన సాగుతోందని కుమారస్వామి ఎద్దేవా చేశారు. అయితే కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఆయన చూపించిన అభిమానానికి నమస్కారం అని తెలిపారు. అయితే జేడీఎస్ ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమిలో ఉందని.. అది తమకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కూటమి నుంచి కుమారస్వామి బయటికి వస్తే ఈ విషయంపై చర్చిద్దామని డీకే శివకుమార్ తెలిపారు. కుమారస్వామి వ్యాఖ్యలు సంతోషం కలిగించాయన్న శివకుమార్.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు.
తమకు మద్దతు ప్రకటించాల్సిన వేళ కాకుండా ఇప్పుడు సహకారం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కుమారస్వామిని బీజేపీ ఒకసారి, కాంగ్రెస్ ఒకసారి.. సీఎం చేశాయని.. జేడీఎస్ అధినేత దేవెగౌడను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని కూడా చేసిందని గుర్తు చేశారు. అనుభవజ్ఞుడైన కుమారస్వామి ప్రతిపక్షంలో ఉంటూ రోజూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ప్రభుత్వానికి సూచనలు, సలహాలతో మార్గదర్శకం చేయాలని డీకే శివకుమార్ పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏడాదిన్నరకే ఆ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు.. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఆ కూటమి విచ్ఛిన్నమై ప్రభుత్వం కూలిపోయింది. అయితే దీనికి కారణం సిద్దరామయ్యనే కారణమని పలుమార్లు కుమారస్వామి ఆరోపించారు. ఆ తర్వాత బీజేపీ, జేడీఎస్ కలిసి అధికారాన్ని చేపట్టాయి