కర్ణాటక పోలీసులకు కొరకరాని కొయ్యలా తయారైన ఓ ఘరానా దొంగ పట్టుబడ్డాడు. ఒకటా రెండా ఏకంగా వంద ఇళ్లలో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు 20 సార్లు జైలుకెళ్లి వచ్చాడు. ప్రతిసారి జైలుకెళ్లడం.. పోలీసులు, జైలు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇళ్ల దొంగగా పేరుపడిన కార్తీక్ కుమార్ అలియాస్ ‘ఎస్కేప్ కార్తీక్’ గోవాలో తాజాగా అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు.. ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. జల్సాలు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కార్తీక్.. ఇళ్లలో దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
హెన్నూర్కు చెందిన కార్తీక్.. 2005లో తన 16వ ఏటే దొంగతనాలు మొదలుపెట్టాడు. కామాక్షిపాళ్య, హెన్నూరు, కొత్తనూరు, మైసూర్, హసన్ జిల్లాల్లో వందకు పైగా ఇళ్లలో చోరీలు చేసిన అతడ్ని ఇప్పటివరకు 20 సార్లు అరెస్టు చేశారు .2008లో ఓ చోరీ కేసులో మొదటిసారి అరెస్టైన కార్తీక్.. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోకి భోజనం తీసుకొచ్చిన వచ్చిన వాహనంలో దాక్కుని పరారయ్యాడు. నెలన్నర తరువాత మళ్లీ పట్టుబడిన కార్తీక్.. 2010లో మరోసారి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల వాహనంతో పరారయ్యాడు. కొన్నిరోజుల తరువాత పోలీసులకు చిక్కాడు. దీంతో అతడికి ఎస్కేప్ కార్తీక్ అనే పేరు వచ్చింది.
చోరీ కేసులో అరెస్టు అవ్వడం.. తప్పించుకుని మళ్లీ దొంగతనాలకు పాల్పడటం అతడికి నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలో బైక్ చోరీ కేసులో హెన్నూరు పోలీసులు గతేడాది నవంబర్లో అరెస్టు చేయగా.. బెయిల్పై బయటకు వచ్చాడు. తాజాగా, బైక్ దొంగతనం కేసులో గోవాకు వెళ్లిన గోవిందరాజనగర్ పోలీసులు మళ్లీ కార్తీక్‌ను అరెస్టు చేయడం గమనార్హం. కార్తీక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్ష్మణ్ అనే వ్యక్తి మద్యం కోసం బైక్‌లు దొంగతనం చేసి.. వాటి బ్యాటరీలు, టైర్లు, ఇతర సామాన్లును తొలగించి అమ్మేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగిలించి.. మరో పోలీస్ స్టేసన్ పరిధిలో వదిలిపెడతాడని చెప్పారు. నింితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 15కిపైగా కేసులు ఉండగా.. గిర్ నగర్ పోలీసులు రూ.11.55 లక్షల విలువచేసే 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, కార్తీక్‌కు పెళ్లై ఇద్దరు పిల్లల కూడా ఉన్నారు. ఇళ్లలో దొంగతనం చేసిన ఆభరణాలు, నగలను తాకట్టు పెట్టి డబ్బుగా మార్చుకుంటాడు. ఆ సొమ్ముతో జల్సాలు చేస్తూ క్యాసినో, జూదం వంటివి ఆడుతుంటాడు.