కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం లోక కల్యాణార్ధం శ్రీనివాస కల్యాణాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనము, పంచామృత మండపారాధాన, మహాస్నపనము, ప్రధాన హోమాలను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేదపండితులు, అర్చకులు ఘనంగా జరిపారు. కల్యాణ తంతులో భాగంగా మంగళసూత్రధారణ, తలంబ్రాలను శాస్త్రోక్తంగా జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి-లావణ్య దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. మేళతాళ మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని కనులారా వీక్షించి తన్మయత్వం పొందారు. కేరళ వాయిద్యాలు, తమిళనాడుకు చెందిన కృష్ణుడి వేషధారణ, మహిళల ప్రదర్శనలు, కేరళకు చెందిన దేవుడు వేషాలు (వారాహి) భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.