సాధికారిత పేరుతో ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రగతిని భ్రష్టు పట్టించారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. పలాస-కాశీబుగ్గలో మంత్రి అప్పలరాజు బుద్ధిమాంధ్యంతో పనులు చేస్తున్నారని, నిత్యం ప్రజలు తిరుగాడే నడి రోడ్డుపై బస్సు యాత్ర పేరుతో సభ పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయపెట్టి సభా స్థలానికి తీసుకువచ్చారని ఆరోపించారు. నడిరోడ్డుపై సభలు పెడితే పోలీసు యంత్రాంగం ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉందని విమర్శించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తాము అన్ని అనుమతులు తీసుకొని ఒక ప్రైవేటు స్థలంలో శాంతియుతంగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మంత్రి అప్పలరాజు అడ్డుతగిలారని, ప్రస్తుతం నడిరోడ్డుపై సభలు పెడితే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు టంకాల రవిశంకర్‌గుప్తా, సూరాడ మోహనరావు, దాసరి తాతారావు, జోగ మల్లేశ్వరరావు, తలగాన నర్సింహమూర్తి, నాబిలి శ్రీనివాసరావు, గోళ్ల చంద్రరావు పాల్గొన్నారు.