రాష్ట్రాన్ని కరువు రక్కసి కబళిస్తుంటే జగన్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడే నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆవేదన ఈ ముఖ్యమంత్రికి పట్టదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లకుండా సాకులు చెప్పిన జగన్‌రెడ్డి... ఇప్పుడు కరువు బారిన పడిన రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ సైకో పాలనలో ఉండలేక వరుణుడు కూడా రాష్ట్రం విడిచిపోయాడా? 440 మండలాల్లో వర్షపాతం తగ్గి, పంటలు వేయలేక, వేసిన పంట ఎండిపోయి, సాగునీటికి రైతులు నానా అవస్థలు పడుతుంటే... మొక్కుబడిగా 103 మండలాలు ప్రకటించి, చేతులు దులుపుకుంటారా? ఒక పంటకే సాగునీరు అందించలేని జలవనరుల మంత్రి ప్రతిపక్షాలపై కుక్కలా మొరుగుతుంటాడు. సేద్యాన్ని గాలికి వదిలేసి, రైతుల ఆత్మహత్యలకు కారకుడైన ఫైళ్ల దొంగ వ్యవసాయ మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి’’ అనగాని అన్నారు.