తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో పడిన వానకుశ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయం అయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథి గృహాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత కూడా మరింత పెరిగింది. ఉదయం నుంచే వాతావరణం కాస్త చల్లబడింది.. మధ్యాహ్నం వాన కురిసింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కనిపించింది.. 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు రాగా.. 23,466మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ తెలిపింది.