విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫాంపై వేచి ఉన్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కండక్టర్‌తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.12వ నంబర్ ప్లాట్‌ఫాం దగ్గర ఈ ఘటన జరిగింది.. ప్రమాదంలో 11, 12 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఫర్నిచర్ ధ్వంసమైంది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు.
విజయవాడలో బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని.. ప్రమాదానికి రెండు వాదనలు వినిపిస్తున్నాయన్నారు. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి కారణం తెలుసుకుంటామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని.. గాయపడిన వారికి ఆసుపత్రి ఖర్చులు భరిస్తామన్నారు.
బస్టాండులో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. డ్రైవర్ ఇటీవల సిక్‌లో ఉండి.. కోలుకుని విధులకు వచ్చారన్నారు. ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్‌కు బస్సు అప్పగిస్తామని.. డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం కాబట్టే.. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతున్నామన్నారు. బస్సు కండీషన్ బాగానే ఉందని తనకు సమాచారం ఉందని.. నిపుణులు నివేదికను బట్టి ఎవరి తప్పో తేలుతుంది అన్నారు. వయసు రీత్యా కొన్ని బస్సులను కొందరికే నడిపేలా డ్యూటీ వేస్తామని.. ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నామనేది సరికాదన్నారు. బస్సు కండీషన్ కూడా పరిశీలించి రూట్లను నిర్ధారిస్తామని.. నెలకు మూడు వందల బస్సులు ఈనెల నుంచి కొత్తగా వస్తున్నాయన్నారు.
బస్సు ఫ్లాట్ ఫాం మీదకి దూసుకొచ్చిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు ఆర్టీసీ ఆర్‌ఎం ఏసునాదం. గుంటూరు వెళ్లేందుకు బస్సులోకి ప్రయాణికులను ఎక్కించారని.. బస్సు బయలుదేరేందుకు డ్రైవర్ రివర్స్ గేర్ వేశారని తెలిపారు. గేర్ సరిగా పడకపోవడంతో బస్సు ఫ్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిందన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. శాఖాపరమైన దర్యాప్తు చేశాక చర్యలు తీసుకుంటామన్నారు.
విజయవాడ బస్టాండ్‌లో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని.. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని.. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదన్నారు.