అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు రమేశ్ యాదవ్ చిట్టీల పేరుతో తమను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతపురం నగరం శాంతినగర్ బోర్డు ఆర్‌కే నగర్ సమీపంలో నివాసం ఉంటున్న రమేశ్ యాదవ్ కొంతకాలంగా టవర్ క్లాక్ దగ్గర ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో చిట్టీలు నిర్వహించేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయినందున నమ్మకంతో చిట్టీలలో పొదుపు కోసం డబ్బులు కట్టామన్నారు. ఆరు నెలలుగా చిట్టీల డబ్బులు ఇవ్వకుండా తమ నుంచి తప్పించు తిరుగుతున్నాడన్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్లు నిర్మించుకోవటానికి ఇలా అనేక రకాలుగా డబ్బును పొగు చేస్తే ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశామన్నారు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు నమోదు చేయించామన్నారు. ఇలా అనేక మంది బాధితులు ఉన్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ, పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని తమకు డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు. బాధితులు రాజు, చలపతి, పురుషోత్తం, ప్రసాద్, నల్లప్ప, నరేంద్ర, హర్షద్ హుసేన్, యుగేంధర్, శ్రీనివాసులు మాట్లాడారు.